: దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు తీసుకురావాలి: ‘పవిత్ర హారతి’ కార్యక్రమం వద్ద చంద్రబాబు
విజయవాడ కృష్ణా నదీ తీరంలోని పవిత్రసంగమం వద్ద ఈ రోజు సాయంత్రం నిర్వహించిన పవిత్రహారతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా హాజరయ్యారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు తీసుకురావాలని అన్నారు. తెలుగువారికి పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. దేశ, విదేశాల్లో ఉండే భారతీయులు దీపావళి ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. పవిత్ర హారతి కార్యక్రమం కన్నులపండువగా కొనసాగుతోంది. వేదమంత్రాల మధ్య కృష్ణమ్మకు అర్చకులు పవిత్రహారతిని సమర్పించారు. బాణసంచా వెలుగుల్లో ఆ పరిసరాలంతా వెలిగిపోయాయి. పండుగ నేపథ్యంలో అక్కడ నరకాసుర వధ చేశారు. సాంస్కృతిక ప్రదర్శనలు కొనసాగుతున్నాయి.