: ‘అనంత’లో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి పరిటాల సునీత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ఈ రోజు పలువురు అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతపురంలోని రాప్తాడు నియోజకవర్గంలో తాగునీటి సౌకర్యాల కల్పన, వివిధ పథకాలపై ఆరా తీసిన ఆమె సమస్యలు ఉన్నాయని తెలుసుకొని అధికారులను నిలదీశారు. తనకు కథలు చెప్పకూడదని, పనులు సక్రమంగా నిర్వర్తించాలని ఆమె హెచ్చరించారు. వాస్తవాలకు భిన్నంగా లెక్కలు చెప్పకూడదని అన్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామల్లో ఉన్న తాగునీటి సమస్యల గురించి తనకు తెలుసునని, అధికారులు వాటిపై దృష్టి పెట్టాలని సూచించారు. అనంతపురంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా రేషన్ దుకాణం ద్వారా పేదలకు రాగులు, జొన్నలు వంటి తృణ ధాన్యాలు ఇవ్వాలనుకుంటున్నామని పరిటాల సునీత చెప్పారు. తెల్లకార్డులపై రేషన్ తీసుకోకపోయినా ఆ కార్డును రద్దు చేయడం లేదని, దీనిపై అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని ఆమె పేర్కొన్నారు.