: 26/11 ముంబై తరహా దాడులకు ఐఎస్ఐ ప్లాన్
సర్జికల్ స్ట్రయిక్స్ కు ప్రతీకారంగా భారత్ లో మరో భారీ విధ్వంసానికి పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్సీ (ఐఎస్‌ఐ) కుట్ర పన్నినట్టు భారత నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. గూఢచర్యం నేరంపై పాక్ హైకమిషన్ ఉద్యోగి మహ్మద్ అక్తర్ ను విచారించిన సందర్భంగా పలు కీలక విషయాలను భద్రతాధికారులు సేకరించారు. ఈ సందర్భంగా ఐఎస్ఐ వ్యూహరచనలో భాగంగా ఆయన భారత రక్షణ వ్యవస్థ సమాచారం సేకరించాడని సమాచారం. ఆ సమాచార సేకరణకే ఆయనను భారత్ లోని హైకమిషన్ కార్యాలయంలో నియమించారు. ఈ సందర్భంగా అతడి వాంగ్మూలాన్ని వీడియో రికార్డు చేశారు. ఈ సందర్భంగా ఐఎస్ఐ 26/11 ముంబై తరహా దాడులకు వ్యూహరచన చేసిందన్న నిర్ధారణకు వచ్చారు. అందులో భాగంగా భారత పశ్చిమ తీరం వెంబడి భద్రతాదళాల మోహరింపునకు సంబంధించిన కీలక సమాచారాన్ని అక్తర్ సేకరించాడని వారు చెబుతున్నారు. విచారణ సందర్భంగా పాక్ హైకమిషన్ కార్యాలయంలో గూఢచర్యానికి పాల్పడుతున్న పలువురు అధికారుల పేర్లను కూడా ఆయన వెల్లడించినట్టు తెలుస్తోంది. మరోపక్క, గత మూడేళ్లుగా తాను అక్తర్ తో టచ్ లో ఉన్నానని జోధ్ పూర్ లో అరెస్టయిన సోహయిబ్ విచారణలో వెల్లడించాడు.