: సైరస్ మిస్త్రీ పచ్చి అబద్ధాలకోరని రుజువు చేస్తాం: టాటా సన్స్
తనను టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి తొలగించిన తరువాత, తాను రాసిన 2100 పదాల లేఖలో సైరస్ మిస్త్రీ, రతన్ టాటా సహా టాటా గ్రూప్ సంస్థలను ఉద్దేశించి పలు విమర్శలు, ఆరోపణలు చేయగా వాటిని టాటా సన్స్ ఖండించింది. మిస్త్రీ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, ఆయన ఆరోపణలు అవాస్తవమని రుజువు చేస్తామని, అందుకు సంబంధించిన రికార్డులన్నీ ప్రజల ముందు ఉంచుతామని స్పష్టం చేసింది. టాటా సన్స్ కు ప్రజల్లో ఉన్న గౌరవాన్ని ఆయన ప్రశ్నించారని దుయ్యబట్టింది. బోర్డులో 2006 నుంచి పదవులు అనుభవించి, ఆపై డిసెంబర్ 2012లో డిప్యూటీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన ఆయన నేతృత్వంలోనే ఎన్నో కీలక నిర్ణయాలు జరిగాయని, ఇప్పుడు వాటినే ఆయన ప్రశ్నిస్తున్నారని, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించింది. మాజీ చైర్మన్ గా, అంతకుముందు వివిధ దశల్లో వ్యాపార నిర్ణయాలు తీసుకోవడం వెనుక ఆయన హస్తముందని తెలిపింది. టాటా ట్రస్ట్ సంస్థలు, వాటి ట్రస్టీలు ఎన్నోమార్లు మిస్త్రీ నిర్ణయాలను ప్రశ్నించారని, వాటికి ఆయన వద్ద సమాధానం లేకపోయిందని వెల్లడించింది. తనకు అధికారం ఇవ్వకుండా, ప్రత్యామ్నాయ శక్తి హోదాలో రతన్ టాటా కార్యకలాపాలు నిర్వహించారని మిస్త్రీ చేసిన ఆరోపణలను టాటా సన్స్ ఖండించింది.