: పాకిస్థాన్ త్వరలోనే కనుమరుగవుతుంది: జమ్ముకశ్మీర్ ఉప ముఖ్యమంత్రి
జమ్ముకశ్మీర్ ప్రాంతంలో పాకిస్థాన్ రేంజర్లు కాల్పులకు తెగబడుతున్న అంశంపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ మండిపడ్డారు. తమ రాష్ట్రాన్ని పాక్ అస్థిరపరుస్తోందని అన్నారు. పాక్‌ని ఒక విఫలదేశంగా ఆయన అభివర్ణించారు. ప్రపంచ పటం నుంచి ఆ దేశం త్వరలోనే కనుమరుగవుతుందని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌లో ఇప్పటికీ బంగ్లాదేశ్ ఏర్పడినప్పటి పరిస్థితులే ఉన్నాయని ఆయన అన్నారు. నియంత్రణ రేఖను దాటి పీవోకేలోకి ప్రవేశించి అక్కడి ఉగ్రవాద శిబిరాలపై భారత్ సర్జికల్ స్ట్రయిక్స్ చేసినప్పటి నుంచి పాక్ కుదురుగా ఉండలేక కాల్పులకు తెగబడుతోందని నిర్మల్ సింగ్ విమర్శించారు. తమ రాష్ట్రంలోకి పాకిస్థాన్ ఉగ్రవాదులను పంపుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం తమ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు పాక్‌దే బాధ్యత అని అన్నారు.