: తన సంస్థలో మిస్త్రీకి నయాపైసా వాటా ఉండరాదని భావిస్తున్న రతన్ టాటా


టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి తొలగించబడిన సైరస్ మిస్త్రీకి, అతని కుటుంబానికి కంపెనీలో ఎంతమాత్రమూ వాటా ఉండరాదని రతన్ టాటా భావిస్తున్నట్టు తెలుస్తోంది. మిస్త్రీ కుటుంబానికి సంస్థలో స్వల్ప వాటాలుండగా, ఆయన్ను చైర్మన్ గా నియమించిన తరవాత వివిధ గ్రూప్ కంపెనీల్లో కొంత వాటాలను టాటా సన్స్ అందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన్ను తొలగించిన తరువాత సావరిన్ వెల్త్ ఫండ్స్, దీర్ఘకాల ఇన్వెస్టర్లు ఎవరైనా మిస్త్రీ వాటాను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించాలని టాటా ఫ్యామిలీ ట్రస్ట్ కోరుకుంటోంది. ఈ మేరకు మిస్త్రీ కుటుంబాన్ని సంప్రదించాలని పలు కంపెనీలకు రతన్ టాటా వర్గం సూచిస్తోంది. కాగా, మిస్త్రీతో పాటు వారి కుటుంబ వ్యాపార గ్రూప్ షాపూర్జీ పల్లోంజీకి టాటా సన్స్ సంస్థలో 18 శాతం వరకూ వాటా ఉంది. ఈ వాటాను విక్రయించి బయటకు వెళ్లేందుకు మిస్త్రీ కుటుంబం ససేమిరా అంటున్నట్టు సమాచారం. ఇక మిస్త్రీ ఫ్యామిలీ వాటా విక్రయం జరిగితే, టాటా గ్రూప్ కంపెనీల్లో ఉన్న అనిశ్చితి తొలగిపోతుందని ఈక్విటీ రీసెర్చ్ సంస్థ అషికా స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ పరాస్ బోత్రా అభిప్రాయపడ్డారు. అయితే, ఎంతమాత్రమూ పోరాటం చేయకుండా మిస్త్రీ తన వాటాను అంత తేలికగా విక్రయిస్తారని భావించలేమని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News