: పోలీసుల అదుపులో ఆర్కే... ఆయనకు ఏం జరిగినా టీడీపీదే బాధ్యత!: వరవరరావు
ఏవోబీలో జరిగిన ఎన్ కౌంటర్ లో తీవ్రంగా గాయపడ్డాడని అనుమానిస్తున్న మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) పోలీసులు అదుపులో ఉన్నాడని విరసం నేత వరవరరావు ఆరోపించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రా ఒడిషా సరిహద్దులలోని మల్కన్ గిరి జిల్లా అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్కౌంటర్ సందర్భంగానే ఆర్కే సహా పలువురు అగ్రనేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అన్నారు. అలా అదుపులోకి తీసుకున్న వారినందర్నీ తక్షణం కోర్టులో హాజరు పరచాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్కేకు ఏం జరిగినా తెలుగుదేశం ప్రభుత్వానిదే బాధ్యత అవుతుందని ఆయన హెచ్చరించారు. కాగా, ఎన్ కౌంటర్ నుంచి ఆర్కే తప్పించుకున్నారని, ఏవోబీలో ఎక్కడైనా దాక్కునే అవకాశం ఉందని, కూంబింగ్ ను పెంచామని ఏపీ డీజీపీ సాంబశివరావు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏవోబీలో ఆయన ఆచూకీ లభించకపోవడం, మృతుల్లో కూడా మావోయిస్టుల అగ్రనేతల మృతదేహాలు లభ్యం కాకపోవడంతో ఆర్కే పోలీసుల అదుపులో ఉండి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.