: నయీమ్ కేసులో తొలి ‘రాజకీయ నాయకుడిపై వేటు’ త్వరలోనే!


చేసిన పాపాలు పండిపోవడంతో ఇటీవ‌లే తెలంగాణ పోలీసుల చేతిలో హ‌త‌మైన‌ గ్యాంగ్‌స్టర్‌ నయీమ్ కేసులో ద‌ర్యాప్తు వేగంగా కొన‌సాగుతోంది. నయీమ్‌తో స్నేహం చేస్తూ అత‌డి దారుణాల్లో పాలుపంచుకున్న రాజకీయ నాయకులు, పోలీసు అధికారులపై తెలంగాణ ప్ర‌భుత్వం కొర‌డా ఝుళిపించ‌డానికి సిద్ధ‌మైంది. న‌యీమ్‌తో సంబంధాలున్నట్టు నల్లగొండ టీఆర్‌ఎస్‌ నేత, శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ విద్యాసాగర్‌ రావు ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్న విష‌యం తెలిసిందే. రానున్న దీపావ‌ళి పండుగ అనంత‌రం ఆయ‌నపై స‌ర్కారు వేటు వేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు టీఆర్ఎస్ ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. త్వ‌ర‌లోనే స్వచ్ఛందంగా మండలి డిప్యూటీ చైర్మన్‌ పదవికి ఆయ‌న రాజీనామా చేస్తార‌ని తెలుస్తోంది. వ‌చ్చేనెల 2న విద్యాసాగర్‌ రావు రాజీనామా, 5న డిప్యూటీ చైర్మన్‌గా కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు నారదాసు లక్ష్మణరావు బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ జ‌రుగుతాయ‌ని టీఆర్ఎస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. నయీమ్ కేసులో ఎంతో మంది రాజకీయ నాయకులు, పోలీసు అధికారుల పేర్లు బ‌య‌ట‌ప‌డుతున్న విష‌యం తెలిసిందే. ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం (సిట్‌) కూడా న్యాయ‌స్థానానికి సమర్పించిన నివేదిక‌లో విద్యాసాగర్‌ రావు పేరును పేర్కొంది. న‌యీమ్‌తో ఆయనకు సంబంధాలు ఉన్నాయని, న‌యీమ్ ఆగ‌డాల‌తో ఇబ్బందులు ఎదుర్కున్న‌ బాధితులు కూడా సిట్‌ ముందు పేర్కొన్నారు. మ‌రి కొంత మంది టీఆర్ఎస్‌ నాయకులపైనా చర్యలు తప్పవని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News