: కత్రినా కైఫ్ కు దీపావళి స్పెషల్ ఇన్వెస్ట్ మెంట్ సలహా ఇచ్చిన 'బిగ్ బుల్' ఝున్ ఝున్ వాలా
దలాల్ స్ట్రీట్ బిగ్ బుల్ రాఖేష్ ఝున్ ఝున్ వాలా... మార్కెట్ వర్గాలకు సుపరిచితమైన పేరు. తన పెట్టుబడి ఆలోచనలతో సంపదను ఎన్నో రెట్లు పెంచుకున్న ఘనత ఆయనది. ఈ దీపావళి సందర్భంగా బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కు ఆయన ఓ పెట్టుబడి సలహాను ఇచ్చారు. పెట్టుబడులు పెట్టేముందు నిపుణుల సలహాను తీసుకోవాలని సూచిస్తూనే, దీర్ఘకాలంలో ఓ సొంత గృహం, జీవనానికి సరిపడా సంపదను సృష్టించుకోవాలని అన్నారు. నిపుణులను సలహాలు అడగాలే తప్ప, టిప్స్ గురించి చూడకూడదని అంటూ, పెట్టుబడులు పెట్టడమన్నది, ఏ కంపెనీ వృద్ధి బాటన పరుగులు పెడుతుందన్నది అందరికీ తెలిసే అంశం కాదని అన్నారు. ముందుగా ఓ సొంత ఇంటిని సమకూర్చుకోవాలని కత్రినకు సలహా ఇచ్చిన ఆయన, ప్రతి భారతీయుడికీ ఈ సలహా వర్తిస్తుందని, ఇండియాలో అతి క్లిష్టమైనది ఇంటిని కొనుగోలు చేయడమేనని అన్నారు. సొంత ఇల్లుంటే ఎంతో భద్రత ఉన్నట్టేనని సూచించారు. ఈ దీపావళికి సొంతింటి కలను సాకారం చేసుకునేలా పెట్టుబడులు పెట్టాలని సలహా ఇచ్చారు.