: మా దేశానికి వచ్చి ప్రమాదాలను కొనితెచ్చుకోవద్దు: విదేశీ క్రికెటర్లకు పాక్ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ హెచ్చరిక
ఇప్పటికే పాకిస్థాన్ గడ్డపై క్రికెట్ ఆడటానికి విదేశీ జట్లు వెనకడుగు వేస్తున్నాయి. విదేశీ టూర్లకు వెళ్లడమో లేక తటస్త వేదికలపై ఆడటమో చేస్తోంది పాక్ క్రికెట్ టీమ్. ఈ నేపథ్యంలో, రావల్పిండి ఎక్స్ ప్రెస్, పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాక్ లో ఆడటానికి విదేశీ జట్లు రావద్దని హెచ్చరించాడు. క్వెట్టా పోలీస్ అకాడమీపై ఉగ్రవాదులు దాడి చేసి, 62 మంది పోలీసులను హతమార్చిన నేపథ్యంలో అతను ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో తమ దేశంలో భద్రత లేదని, ఇక్కడ పర్యటించే విదేశీ జట్లకు ఇది ఏమాత్రం సురక్షితం కాదని, పరిస్థితులు మెరుగు పడేంత వరకు పాక్ లో పర్యటించవద్దని సూచించాడు. విదేశీ జట్లు తమ దేశంలో పర్యటించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చేస్తున్న ప్రయత్నాలను షోయబ్ తప్పుబట్టాడు. ఓ వైపు వరుసగా ఉగ్రదాడులు జరుగుతుంటే... తమ దేశంలో ఆడాలంటూ విదేశీ జట్లను ఆహ్వానించడం సరైంది కాదని అన్నాడు. త్వరలోనే పాక్ లో పరిస్థితులు చక్కబడతాయనే ఆశాభావం వ్యక్తం చేశాడు.