: జియోకు శుభవార్త... సిమ్ వాడే కస్టమర్లకు చేదువార్త!


ఉచితకాల్స్, అతి తక్కువ ధరకు డేటాను ఇస్తామంటూ సంచలన ప్రకటనతో మార్కెట్ ను తాకిన రిలయన్స్ జియో, తన లక్ష్యాన్ని చేరుకున్నట్టే కనిపిస్తోంది. జియో అందుబాటులోకి వచ్చిన తరువాత 1.6 కోట్ల మంది సిమ్ లను తీసుకోగా, మొత్తం కస్టమర్ల బేస్ 2.4 కోట్లకు చేరుకుంది. ఇది సంస్థకు శుభవార్తే. మూడు నెలల ఉచిత ఇంటర్నెట్, ఉచిత కాల్స్ ఆఫర్ కారణంగానే అత్యధికులు ఈ సిమ్ లను తీసుకున్నారు. ఇక సిమ్ లను తీసుకున్న వారిలో ఎంతో మంది తాము కాల్స్ చేసుకోలేకపోతున్నామని ఫిర్యాదులు చేస్తున్నారు. యూజర్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ జియో ఇంటర్నెట్ వేగం గణనీయంగా తగ్గిపోయింది. ట్రాయ్ స్వయంగా జియో వేగాన్ని లెక్కించి, జియో స్థానం టాప్-5లో ఆఖరిదని తేల్చింది. సిమ్ ఉన్నప్పటికీ దాన్ని సరిగ్గా వినియోగించుకోవడంలో విఫలమవుతున్న ఎంతో మంది యూజర్లు ఇప్పుడు దాన్ని పక్కన పడేస్తున్నారు. ఒక్క కాల్ చేసుకోవడానికి అదే పనిగా డయల్ చేస్తూనే ఉండాల్సి వస్తోందన్నది జియో యూజర్ల నుంచి వస్తున్న ప్రధాన ఫిర్యాదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు తాము చర్యలు తీసుకుంటున్నామని రిలయన్స్ జియో అధికారులు ప్రకటించినా, ఇంతవరకూ ఆ దిశగా అడుగులు మాత్రం పడలేదు. ప్రస్తుతం తెలంగాణలో 12 లక్షల మంది జియో సిమ్ లను వాడుతున్నవారుండగా, గుజరాత్ లో 15 లక్షల మంది వీటిని వినియోగిస్తున్నారు. ఈ సంఖ్య ఎంతగా పెరిగితే, డేటా వేగం అంతగా తగ్గుతుందన్న చేదువార్త జియో సిమ్ తీసుకున్న వారిలో ఆందోళన కలిగిస్తోంది.

  • Loading...

More Telugu News