: హిందూ మతంలోకి విదేశీయులు.. తెలుగుదనం ఉట్టిపడేలా పేర్లను సైతం మార్చుకున్న వైనం!
సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లుగా భాసిల్లుతున్న భారత్ అంటే మోజు పడే విదేశీయులు ఎందరో. ఈ ఒక్క అంశంమే ప్రపంచ దేశాల్లో భారత్‌ను ప్రత్యేకంగా నిలబెడుతోంది. హిందూమతం గొప్పతనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీనికి ఆకర్షితులైన ముగ్గురు విదేశీయులు హిందూమతం స్వీకరించారు. అంతేకాదు, తెలుగుదనం ఉట్టిపడేలా తమ పేర్లను మార్చుకున్నారు. వివరాల్లో వెళితే.. ఆస్ట్రేలియాకు చెందిన జెస్సికా, తైష్, న్యూజిలాండ్‌కు చెందిన దైలం తరచు భారత పర్యటనకు వచ్చి పలు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ఉంటారు. అందులో భాగంగా హైదరాబాదు నగరానికి వచ్చి కొన్నాళ్లపాటు మన్సూరాబాద్‌లో ఉండి వెళ్తుంటారు. ఈ క్రమంలో ఇక్కడి స్థానికులతో వారికి పరిచయం ఏర్పడింది. హిందూ మతంపై ఆసక్తి పెంచుకున్నారు. పద్ధతులు, ఆచారవ్యవహారాలపై ఇష్టం ఏర్పడింది. దీంతో హిందూమతం పుచ్చుకోవాలని నిర్ణయించుకున్నారు. వీరికి వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ ప్రతినిధులు సహకారం అందించారు. బుధవారం స్థానిక నాగలింగేశ్వర స్వామి ఆలయంలో వేదపండితుల మంత్రోచ్చారణ నడుమ యజ్ఞం, ప్రత్యేక పూజలు చేసి హిందూ మతాన్ని స్వీకరించారు. యువతులు తమ పేర్లను విజయలక్ష్మి, పావనిగా మార్చుకోగా యువకుడు తిరుమలేష్ అని పెట్టుకున్నాడు.