: టెయిలెండర్లు పోరాడినా.. టీమిండియా పరాజయం!


రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా పరాజయం పాలైంది. 261 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా కేవలం 19 పరుగులకే రోహిత్ శర్మ (11) వికెట్ కోల్పోగా, టెస్టు కెప్టెన్, ఛేజింగ్ రారాజు విరాట్ కోహ్లీ (45) విఫలమయ్యాడు. అనంతరం రహానే (57) కీలక సమయంలో అవుటయ్యాడు. అనంతరం కెప్టెన్ ధోనీ (11) నీషమ్ వేసిన అద్భుతమైన బంతికి పెవిలియన్ చేరాడు. ఈ దశలో అక్షర్ పటేల్ కు జత కలిసిన మనీష్ పాండే కొట్టిన షాట్ ను న్యూజిలాండ్ ఆటగాడు లాంథమ్ అద్భుతంగా అందుకున్నాడు. దీంతో నిరాశగా పాండే (12) వెనుదిరిగాడు. తరువాతి బంతిని అంచనా వేయడంలో తడబడ్డ కేదార్ జాదవ్ (0) డకౌట్ అయ్యాడు. దీంతో అక్షర్ పటేల్ కు హార్దిక్ పాండ్య (9) జత కలిశాడు. వీరిద్దరూ సమన్వయంతో ఆడుతూ ఆకట్టుకున్నారు. ఆ దశలో హార్దిక్ పాండ్య కొట్టిన షాట్ ను లాంథమ్ మరోసారి కళ్లు చెదిరే రీతిలో అందుకున్నాడు. దీంతో టీమిండియా పరాజయం ఖారారైంది. ఈ దశలో అక్షర్ పటేల్ (38) కు జతకలిసిన అమిత్ మిశ్రా (14) అద్భుతంగా ఆడాడు. టీమిండియా స్పిన్నర్లిద్దరూ క్రీజులో ఉన్నంత సేపు విజయంపై ఆశలు రేపారు. చేజేతులా చేసిన తప్పిదంతో టీమిండియాకు విజయాన్ని దూరం చేశారు. అక్షర్ పటేల్ కొట్టిన షాట్ ను డీప్ స్క్వేర్ లెగ్ నుంచి శాంటనర్ విసిరిన త్రోతో రెండో పరుగు కోసం ప్రయత్నించిన మిశ్రా దూసుకురాగా, ముందుకొచ్చిన పటేల్ వెనక్కి వెళ్లిపోయాడు. మిశ్రా రనౌట్ గా వెనుదిరిగడంతో వీరి బంధం విడిపోయింది. దీంతో ఏకాగ్రత కోల్పోయిన అక్షర్ పటేల్ ఆ తరువాతి బంతికి బౌల్డయ్యాడు. దీంతో టీమిండియా 43 ఓవర్లో 207 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది. అనంతరం ఉమేష్ యాదవ్ (7) అండగా, ధావల్ కులకర్ని (25) చెలరేగి ఆడాడు. కివీస్ బౌలర్లను తీవ్రంగా ప్రతిఘటించిన వీరిద్దరూ పదో వికెట్ కు 34 పరుగులు జోడించి పార్టనర్ షిప్ రికార్డు నెలకొల్పారు. దీంతో టీమిండియా 241 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించి, 19 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కివీస్ బౌలర్లలో మూడు వికెట్లతో సౌతీ, రెండు వికెట్లతో నషీమ్, బౌల్ట్ రాణించగా, చెరో వికెట్ తీసి శాంటనర్, సోడీ చక్కని సహకారమందించారు. దీంతో వన్డే సిరీస్ 2-2తో ఆసక్తిగా మారింది. వైజాగ్ లో జరగనున్న చివరి వన్డే ఉత్కంఠగా మారింది.

  • Loading...

More Telugu News