: రాంచీ వన్డేలోనూ ధోనీ అదే చేశాడు!
టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఇటీవలే ధర్మశాలలో మీడియాతో మాట్లాడుతూ తాను విరాట్ కోహ్లీ నుంచి సలహాలను స్వీకరిస్తున్నానని చెప్పిన విషయం తెలిసిందే. తాను మైదానంలో ఉన్నప్పుడు కోహ్లీ ఇచ్చే సూచనలనే ఎక్కువగా తీసుకుంటానని, కావాలంటే 'నేను క్రీజులో ఉన్నప్పుడు మీరూ చూడండి' అంటూ అభిమానులకు ఈ అంశంపై ఒక సూచన కూడా చేశాడు. ఈ రోజు రాంచీలో న్యూజిలాండ్‌తో టీమిండియా నాలుగో వన్డే ఆడుతున్న సందర్భంగా ధోనీ తాను చెప్పినట్లే చేశాడు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు విరాట్‌తో మాట్లాడుతూ కనిపించాడు. కోహ్లీ నుంచి సూచనలు తీసుకున్నాడు. వన్డేల్లో తొలి మ్యాచ్ నుంచే ఫీల్డింగ్, బౌలింగ్ మార్పుల విషయంలో ధోనీ సూచనలు తీసుకుంటున్నాడు. తరచుగా ఈ ఇద్దరు స్టార్ బ్యాట్స్‌మెన్ మైదానంలో సీరియస్‌గా చర్చించుకుంటూ కనిపిస్తున్నారు. నాలుగో వన్డేలోనూ వీరిద్దరు సీరియస్‌గా పలు అంశాలపై మాట్లాడుకున్నారు.