: హీరోయిన్లు, ఫిలింమేకర్లపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జయ బచ్చన్


ఫిలిం మేకర్లు గతంలో కళాఖండాలను రూపొందించేవారని... కానీ, ఇప్పటి ఫిలిం మేకర్లకు అది పట్టడం లేదని, కేవలం నంబర్లు, బిజినెస్ మాత్రమే చూసుకుంటున్నారని అమితాబ్ బచ్చన్ సతీమణి జయ బచ్చన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి సినిమా పచ్చి బిజినెస్ గా మారిందని, ఒక్క మాటలో చెప్పాలంటే సినిమావాళ్లు బరితెగించారని ఆమె విమర్శించారు. తొలి వారం రికార్డులు, రూ. 100 కోట్ల కలెక్షన్లు... ఇప్పుడంతా వీటినే చూస్తున్నారని తెలిపారు. ఈ విషయాలన్నీ తనకు అర్థం కావని, అందుకే ఇలాంటి చోట తాను ఇమడలేకపోతున్నానని చెప్పారు. తెరనిండా పాశ్చాత్య పోకడలు కనిపిస్తున్నాయని, పొట్టి పొట్టి దుస్తులే తప్ప భారతీయత ఎక్కడుందని ప్రశ్నించారు. 50, 60 దశకాల్లో సినిమాల్లో జీవం ఉట్టి పడేదని చెప్పారు. ఆ రోజుల్లో సినిమాల్లో ఒక హీరోయిన్, ఒక వాంప్ ఉండేవారని... ఇప్పుడు వాంప్ ల అవసరం లేదని, హీరోయిన్లే వాంప్ లు చేయాల్సినవన్నీ చేస్తున్నారని మండిపడ్డారు. అలీగఢ్, మసాన్ లాంటి సినిమాలు నిజమైన భారతీయ సినిమాలని... అలాంటి సినిమాలను భారతీయులు ఆదరిస్తారని తెలిపారు. జనజీవితాలను ప్రతిబింబించే ఏ సినిమా అయినా అద్భుతంగా ఉంటుందని అన్నారు. ముంబై అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజెస్ (మామి) 18వ సినీ ఉత్సవంలో భాగంగా సినీ దర్శకుడు బిమల్ రాయ్ సంస్మరణార్థం రాత్రి ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జయా బచ్చన్ మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News