: సోనియా తలచుకుంటే కేసీఆర్ ఎంత?.. ఆయన ఉద్యమం పాకిస్థాన్‌తో యుద్ధం కంటే ఎక్కువా?: సీఎంపై జానా నిప్పులు


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి నిప్పులు చెరిగారు. అప్పట్లో సోనియా గాంధీ తలచుకుంటే కేసీఆర్ ఏపాటని, ఆయన ఉద్యమం పాకిస్థాన్‌తో చేసిన యుద్ధం కంటే ఎక్కువేమీ కాదని విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించే సోనియా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి జాడ కూడా లేదని ధ్వజమెత్తారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన కేసీఆర్‌పై తొలిసారి విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ బలంగా ఉందని సర్వేలు చెబుతున్నాయని అంటున్న టీఆర్ఎస్ నాయకులు, ఇతర పార్టీల నేతలను ఎందుకు చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. సర్వేల పేరుతో లేని బలాన్ని ఉన్నట్టు చూపి ప్రజలను మరోమారు మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల హామీ ఏమైందని జానారెడ్డి నిలదీశారు.

  • Loading...

More Telugu News