: దుర్గగుడి ఈవో, టీడీపీ ఎమ్మెల్యేల మధ్య ముదురుతున్న వివాదం
దుర్గ గుడి ఈవో సూర్యకుమారి, టీడీపీ ఎమ్మెల్యేల మధ్య ప్రొటోకాల్ వివాదం ముదురుతోంది. ప్రొటోకాల్ తో పాటు, సిఫారసులను పక్కన పెడుతున్నారని, తమను ఎమ్మెల్యేలుగా గుర్తించడం లేదంటూ టీడీపీ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈవోను బదిలీ చేయాలంటూ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమా మాట్లాడుతూ, ప్రజాప్రతినిధిని గౌరవించలేని దుర్గగుడి ఈవో, ఇక, ప్రజలనేమి గౌరవిస్తారంటూ ఈవో సూర్యకుమారిపై మండిపడ్డారు. ఎమ్మెల్యే బాలకృష్ణను కూడా గర్భగుడిలోకి అనుమతించలేదని, అదేమాదిరిగా, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భార్య కూడా అమ్మవారి దర్శనానికి వెళ్తే ఈవో అవమానించారని, ఈవో ప్రవర్తనతో దర్శనానికి వచ్చే భక్తుల శాతం తగ్గిపోయిందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబుకు కూడా ఫిర్యాదు చేస్తామని ఉమ చెప్పారు. కాగా, ఈ ఫిర్యాదు మేరకు ఈవోను మంత్రి ప్రత్తిపాటి వివరణ కోరారు. ఎమ్మెల్యేల పట్ల గౌరవంగా వ్యవహరించాలని సూచించినట్లు సమాచారం.