: కేసీఆర్ తన వ్యక్తిగత మూఢ విశ్వాసాలకు ప్రాధాన్యమివ్వడం తగదు: జీవన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే సీఎం కేసీఆర్ వ్యక్తిగత మూఢ విశ్వాసానికి ప్రాధాన్యమివ్వడం ఏమాత్రం తగదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న పలు సమస్యలను పక్కనపెట్టి, వాస్తు పేరిట కొత్త సచివాలయం నిర్మించాల్సిన అవసరం ఇప్పుడేమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, రైతులు, విద్యార్థులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు. రైతులకు రుణమాఫీ, విద్యార్థులకు ఫీజ్ రియంబర్స్ మెంట్, వ్యవసాయ కూలీలకు ఉపాధి పథకం వేతనాలు చెల్లించడం కన్నా కొత్త సచివాలయం నిర్మించడానికే ప్రాధాన్యమిస్తారా? అని ప్రశ్నించారు. తెలంగాణ భవిష్యత్ ను పక్కనపెట్టిన కేసీఆర్ వ్యక్తిగత మూఢవిశ్వాసాలకు ప్రాధాన్యమిస్తున్నారని జీవన్ రెడ్డి దుయ్యబట్టారు.