: చైనాలో తోడు పెళ్లికూతుళ్లపై విపరీతంగా పెరిగిపోతోన్న వేధింపులు


చైనాలో ఎంతో కాలంగా ఉన్న‌ తోడు పెళ్లకూతుళ్ల సంప్రదాయం కొన్ని సంద‌ర్భాల్లో వారిపై దాడులు చేసే వ‌ర‌కు వెళుతోంది. పెళ్లికూతుళ్లపై అఘాయిత్యాలకు పాల్ప‌డుతున్న ఘ‌ట‌న‌లు అధికంగా వెలుగులోకి వ‌స్తున్నాయి. ప్రధానంగా పెళ్లికొడుకు మిత్రులు తోడు పెళ్లికూతురుపై వేధింపుల‌కు దిగుతున్నారు. ఇట‌ీవ‌లే 28 ఏళ్ల తోడు పెళ్లికూతురికి కొంద‌రు ఫుల్లుగా మద్యం తాగించారు. దీంతో అమె ప్రాణాలు కోల్పోయింది. ఇన్నాళ్లూ లేని ఇటువంటి అఘాయిత్యాలు ఇటీవ‌లి కాలంలో పెరిగిపోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇటీవల తన స్నేహితురాలి పెళ్లికి తోడు పెళ్లికూతురుగా వచ్చిన లియూ యాన్‌ అనే సినీ నటిపై కొంద‌రు మితిమీరిన‌ అల్ల‌రి చేస్తూ ఆమెను స్విమ్మింగ్ పూల్‌లో ప‌డేశారు. చైనా అంత‌ర్జాలంలో ఈ వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మారింది. చైనాలో అప్ప‌ట్లో గణ వ్యవస్థ వుండేది. ఓ గణంలోని అమ్మాయికి పెళ్లి జ‌రుగుతున్న సంద‌ర్భంగా ఆ అమ్మాయిని ఖరీదైన ఆభరణాలతో అలంక‌రించేవారు. దీంతో ఆ నగల కోసం వ‌చ్చి శ‌త్రువులు పెళ్లి కూతురును ఎత్తుకుపోయేవార‌ట‌. అటువంటి సంఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా తోడు పెళ్లికూతుళ్ల ఆచారం వ‌చ్చింద‌ని చైనా వారు పేర్కొంటారు. అంతేగాక‌, పెళ్లి కూతురికి బియ్యంతో చేసిన‌ వైన్‌ తాగడం ఆనవాయితీ ఉంది. దీంతో పెళ్లి కూతురు ప్ర‌మాదంలో ప‌డే అవ‌కాశం ఉండడంతో తోడు పెళ్లికూతురుతోనే వైన్ తాగించ‌డం వంటి కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. తోడు పెళ్లికూతుళ్లకు న‌కిలీ న‌గ‌లు ధ‌రింపజేస్తే ఆమెను ఎత్తుకెళ్లిన వారు ఆమె ధరించిన నగలన్నీ నకిలీవని తెలిసి వదిలేసే వారని చెబుతుంటారు. ఆ ఆచారాన్ని కొన‌సాగిస్తూ ఇప్పుడు కూడా తోడు పెళ్లికూతుళ్లని పెళ్లింట్లో తిర‌గ‌నిస్తుండ‌డంతో ప్ర‌స్తుతం ఈ విధంగా దాడులు జ‌రుగుతున్నాయి. అయితే, ప్ర‌స్తుతం వెడ్డింగ్‌ ప్లానర్లు దీనిపై దృష్టి పెట్టి తోడు పెళ్లికూతుళ్లను పంపించే త‌తంగాన్ని చూస్తున్నారు. ఒక్కో తోడు పెళ్లికూతురుకు 2,200 రూపాయల నుంచి 9,000 రూపాయలను చెల్లిస్తున్నామని చైనాలోని దాదాపు 50 వెడ్డింగ్‌ ప్లానర్లు అంటున్నారు. దీన్ని ఓ వృత్తిగా స్వీకరిస్తూ సెలబ్రటీలుగా కూడా కొంద‌రు భామ‌లు మారిపోతున్నారు. తోడు పెళ్లికూతురు బంధు, మిత్రులతో మద్యం సేవించడంతో అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నాయ‌ని వారు చెబుతున్నారు. దీనిని అరిక‌ట్ట‌డానికి చట్టాలు తీసుకొస్తే మంచిద‌ని అంటున్నారు.

  • Loading...

More Telugu News