: రాహుల్ గాంధీతో చేయి కలపనున్న అఖిలేష్?
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో, అధికార సమాజ్ వాదీ పార్టీలో ముసలం పుట్టింది. తన తండ్రి ములాయం సపోర్ట్ చేస్తున్న బాబాయ్ శివపాల్ వర్గాన్ని కాదని... అవసరమైతే స్వతంత్రంగా పోటీ చేయడానికి అఖిలేష్ సింగ్ సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో, కాంగ్రెస్ పార్టీతో ఆయన పొత్తు పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాహుల్ ను అఖిలేష్ పలుమార్లు బహిరంగంగానే ప్రశంసించారు. ఇటీవల ప్రధాని మోదీని 'ఖూన్ కీ దళాయి' అంటూ రాహుల్ విమర్శించినప్పుడు కూడా... మోదీపై రాహుల్ చేసిన విమర్శలు సమంజసమే అని అఖిలేశ్ వ్యాఖ్యానించారు. ఆలోచించకుండా రాహుల్ గాంధీ ఎలాంటి వ్యాఖ్యలు చేయరని రాహుల్ కు మద్దతుగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీతో తనకు పెద్దగా సంబంధాలు లేనప్పటికీ, రాహుల్ తో మాత్రం మంచి సంబంధాలు ఉన్నాయని అఖిలేశ్ తెలిపారు. ఈ నేపథ్యంలో, రానున్న ఎన్నికల్లో రాహుల్ నాయకత్వంలోని కాంగ్రెస్ తో అఖిలేశ్ వర్గం చేతులు కలిపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరోవైపు, ఉత్తరప్రదేశ్ లో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో, యూపీ కాంగ్రెస్ పార్టీ నిన్న అత్యున్నత సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి ప్రియాంక గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా, ఎస్పీ నుంచి అఖిలేశ్ వర్గం విడిపోయిన పక్షంలో... అఖిలేశ్ తో పొత్తు పెట్టుకుంటే మంచిదనే ప్రతిపాదన కూడా ముందుకు వచ్చిందట.