: పంజాబ్ యూనివర్శిటీలో కొత్త బాధ్యతలను స్వీకరించనున్న మన్మోహన్ సింగ్
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సరికొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు. తాను చదువుకున్న పంజాబ్ యూనివర్శిటీలోనే జవహర్ లాల్ నెహ్రూ ఛైర్ ప్రొఫెసర్ గా వ్యవహరించనున్నారు. దీనికి సంబంధించి గత జూలైలో రాజ్యసభ ఛైర్మన్ ను కూడా మన్మోహన్ సంప్రదించారు. లాభదాయక పదవులను చేపడితే, రాజ్యసభ సభ్యుడిగా ఉన్న తాను అనర్హతకు గురవుతానా? అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ, సలహా అడిగారు. దీంతో, ఈ నెల 14న లోక్ సభ స్పీకర్ కు సంబంధిత సంయుక్త సంఘం ఒక నివేదికను సమర్పించింది. పంజాబ్ యూనివర్శిటీ ఇచ్చిన అవకాశాన్ని మన్మోహన్ వాడుకున్నా ఎలాంటి అనర్హత వేటు పడదని నివేదికలో స్పష్టం చేసింది. మరోవైపు, జవహర్ లాల్ నెహ్రూ ఛైర్ ప్రొఫెసర్ గా బాధ్యతలు స్వీకరించడం కేవలం స్వల్పకాలిక హోదా మాత్రమే అని యూనివర్శిటీ కూడా స్పష్టం చేసింది. ఛైర్ ప్రొఫెసర్ గా మన్మోహన్ సింగ్ గౌరవవేతనాన్ని పొందుతారు. అంతేకాదు, యూనివర్శిటీకి వెళ్లిన ప్రతిసారి ఆయనకు అన్ని వసతులు కల్పిస్తారు.