: వీరిలో టాటా గ్రూప్ ఛైర్మన్ అయ్యేదెవరు?


భారతదేశ పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూపు ఛైర్మన్ గా సైరస్ మిస్త్రీని అనూహ్యంగా తప్పించారు. నిన్న జరిగిన బోర్డు మీటింగ్ లో మిస్త్రీని తొలగించాలని తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ప్రస్తుతానికి తాత్కాలిక ఛైర్మన్ గా రతన్ టాటా వ్యవహరించనున్నప్పటికీ... కొత్త ఛైర్మన్ ఎంపిక కాగానే, తన నూతన వారసుడికి బాధ్యతలు అప్పగించి, పదవి నుంచి ఆయన తప్పుకోనున్నారు. ఈ నేపథ్యంలో, అత్యంత విలువైన టాటా గ్రూప్ తదుపరి ఛైర్మన్ ఎవరు కాబోతున్నారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. నూతన ఛైర్మన్ ఎంపిక ప్రక్రియ మరో రెండు వారాల్లో ప్రారంభం కానుంది. మొత్తం ప్రక్రియ ముగియడానికి మూడు నుంచి నాలుగు నెలల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని... ఛైర్మన్ ఎంపిక కమిటీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఛైర్మన్ పదవిని చేపట్టబోయే వారి లిస్టులో ఇప్పటికే పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వారిలో పెప్పీకో సీఈవో ఇంద్రానూయి, వొడాఫోన్ మాజీ సీఈవో అరుణ్ శరీన్, టీసీఎస్ సీఈవో, ఎండీ ఎన్.చంద్రశేఖరన్, నోయెల్ టాటా, టాటా గ్రూపుకే చెందిన ఇషాంత్ హుస్సేన్, ముత్తురామన్ లు ఉన్నారు. వారిలో ఇంద్రానూయి, నోయెల్ టాటా విషయంలో రతన్ టాటా సానుకూలతతో ఉన్నట్టు సమాచారం. వీరిద్దరిలో కూడా నోయెల్ టాటావైపే రతన్ టాటా ఎక్కువ మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. బయటి వ్యక్తుల కంటే, తమ కుటుంబంలో భాగమైన వ్యక్తికి బాధ్యతలను అప్పగించవచ్చని తెలుస్తోంది. మరోవైపు, అంతర్జాతీయంగా పేరున్న వ్యక్తికి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందనే కోణంలో కూడా టాటా గ్రూపు ఆలోచిస్తోంది. ఈ యాంగిల్ లో చూస్తే, ఇంద్రానూయికి ఎక్కువ మార్కులు పడే అవకాశం ఉంది. టాటా గ్రూపులో ప్రస్తుతం 7 లక్షల మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. 100కి పైగా వ్యాపారాలను ఈ గ్రూపు నిర్వహిస్తోంది.

  • Loading...

More Telugu News