: సచివాలయంకు వెళితే కనీసం పార్కింగ్ సౌకర్యం కూడా లేదు.. అందుకే కొత్త సచివాలయం: కర్నె ప్రభాకర్
తమ సర్కారు చేపడుతున్న కొత్త సచివాలయ భవన నిర్మాణంపై ప్రతిపక్ష పార్టీల నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. ఈ రోజు హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... అన్ని కార్యాలయాలు ఒకేచోట ఉంటే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. సచివాలయంకు వెళితే కనీసం పార్కింగ్ సౌకర్యం కూడా లేదని, అందుకే నూతన సచివాలయ నిర్మాణం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సచివాలయంలో పలు భవనాలు నిజాం కాలం నాడు కట్టినవని ఆయన అన్నారు. మరికొన్ని భవనాలు 50 ఏళ్ల క్రితం నిర్మించినవని చెప్పారు. ఒక్కో కార్యాలయం ఒక్కో ప్రాంతంలో ఉంటే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని కర్నె ప్రభాకర్ అన్నారు. ప్రజాస్వామ్యం అంటూ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమేనని ఆయన విమర్శించారు. దేశంలో అత్యవసర పరిస్థితి విధించి పత్రికలపై ఆంక్షలు విధించి, ఎంతో మందిని అరెస్టు చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.