: అఖిలేష్ యాదవ్ అందుకే కన్నీరు పెట్టుకున్నారా?


ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు సమాజ్ వాదీ పార్టీలో తీవ్ర అవమానాలు ఎదురవుతున్నాయి. సమాజ్ వాదీ పార్టీలో రెండు అధికార కేంద్రాలుగా నేతలు చీలిపోయారు. ఈ నేపథ్యంలో నేడు లక్నోలో చోటుచేసుకున్న పరిణామాలు పార్టీలో నెలకొన్న విభేదాలను బట్టబయలు చేశాయి. అమర్ సింగ్ రాకను తీవ్రంగా వ్యతిరేకించిన అఖిలేష్ యాదవ్ ను పార్టీ సమావేశంలో పార్టీ అధినేత, అఖిలేష్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ 'నోరు మూసుకొ'మ్మని ఒకసారి హెచ్చరించగా, పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించడానికి 'నువ్వెవరు?' అంటూ మరోసారి నిలదీశారు. అంతే కాకుండా అమర్ సింగ్ కు వ్యతిరేకంగా చెప్పే ఏ మాటను వినేందుకు సిద్ధంగా లేమని ఆయన తెలిపారు. అంతే కాకుండా మీటింగ్ చివర్లో విభేదాలు మరచి, బాబాయ్ శివపాల్ యాదవ్ ను ఆలింగనం చేసుకోవాలని ములాయం, తనయుడు అఖిలేష్ యాదవ్ కు సూచించారు. అప్పటికే జరిగిన అవమానాలతో సహనం నశించిన అఖిలేష్ యాదవ్...'అఖిలేష్ ఔరంగజేబు-ములాయం షాజహాన్' అంటూ మీడియాకు లెటర్ అందించారని ఆరోపిస్తూ అశు మాలిక్ అనే ఎమ్మెల్సీని తోసేశారు. దీంతో కల్పించుకున్న శివపాల్ యాదవ్, అఖిలేష్ యాదవ్ చేతుల నుంచి సదరు ఎమ్మెల్సీని విడిపించారు. దీంతో ఈ తతంగం మొత్తం చూసిన ములాయం మండిపడి 'ముఖ్యమంత్రివై ఉండి ఇలా ఎలా ప్రవర్తిస్తున్నావ్?' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అఖిలేష్ విసవిసా నడుచుకుంటూ సమావేశం నుంచి నిష్క్రమించారు. అనంతరం ఆయన కన్నీటి పర్యంతమైనట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News