: ఊహించని వ్యాఖ్యలు చేసిన ములాయం... మోదీపై ప్రశంసలు
అవకాశం దొరికినప్పుడల్లా ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడే ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఊహించని వ్యాఖ్యలు చేశారు. మోదీని ప్రశంసిస్తూ ఆశ్చర్యపరిచారు. వివరాల్లోకి వెళ్తే, తన కుమారుడు అఖిలేశ్, తమ్ముడు శివపాల్ ల మధ్య విభేదాలు తార స్థాయికి చేరడంతో, లక్నోలో ఈ రోజు పార్టీ సమావేశాన్ని నిర్వహించారు ములాయం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "మన ప్రధాని మోదీని చూడండి. పేద కుటుంబం నుంచి వచ్చిన ఆయన అకుంఠిత శ్రమతో ప్రధానమంత్రి స్థాయికి చేరుకున్నారు. ఆయన అంకిత భావం చాలా గొప్పది. తన తల్లిని ఎన్నటికీ వీడనని ఎల్లవేళలా ఆయన చెబుతూనే ఉంటారు. మోదీకి తన తల్లి ఎలాగో, నాకు శివపాల్ యాదవ్, అమర్ సింగ్ అంతే. వారిద్దరిని కూడా నేను ఎన్నటికీ వదలను", అని అన్నారు. తన కోసం, పార్టీ కోసం తన తమ్ముడు శివపాల్ చేసిన కృషిని తాను ఎన్నడూ మరవనని ములాయం చెప్పారు. అమర్ సింగ్ తను సొంత తమ్ముడిలాంటి వాడని, కష్ట సమయాల్లో ఎన్నోసార్లు తన వెన్నంటే నిలిచాడని అన్నారు. అమర్ చేసిన తప్పులన్నీ మాఫీ అయిపోయాయని... ఆయనను తప్పుబట్టడానికి ఏమీ లేదని అన్నారు. వీరిద్దరినీ తాను ఎన్నటికీ వదులుకోలేనని స్పష్టం చేశారు.