: కట్టప్ప గురించి రాజమౌళి ఏమన్నాడంటే...!
బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న విషయం ఇంత పెద్ద సెన్సేషన్ అవుతుందని తామెవరూ ఊహించలేదని దర్శక దిగ్గజం రాజమౌళి అన్నాడు. మొదటి భాగాన్ని ముగించేందుకు ఆ సన్నివేశమే సరైనదని భావించామని... కానీ, ఆ ముగింపు ఇంత సెన్సేషన్ గా మారుతుందని అనుకోలేదని చెప్పాడు. 'బాహుబలి-2' ఫస్ట్ పోస్టర్ లాంచ్ సందర్భంగా పలు అంశాలపై స్పందించిన ఆయన, ఈ విషయాన్ని వెల్లడించాడు. ఏదేమైనప్పటికీ... బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న విషయం ఇంత పాప్యులర్ కావడం ఆనందాన్ని కలిగిస్తోందని అన్నాడు. కట్టప్పను బాహుబలి ఎందుకు చంపాడో ఎవరైనా సరిగ్గా చెప్పారా? అనే ప్రశ్నకు బదులుగా 'లేదు' అని సమాధానమిచ్చాడు రాజమౌళి. తొలి భాగంలో నటించడం ద్వారా తాను పొరపాటు చేశానని... ఇకపై ఇలాంటి పొరపాట్లు చేయబోనని చెప్పాడు. బాహుబలి ఫస్ట్ పార్ట్ హిట్ కావడంతో... సెకండ్ పార్ట్ తీయడం తనకు తేలికైందని తెలిపాడు.