: కన్నీళ్లు పెట్టుకున్న అఖిలేశ్ యాదవ్.. తండ్రి కోరితే రాజీనామా చేస్తానని ప్రకటన!
తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ కోరితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి కూడా తాను సిద్ధమేనని యూపీ సీఎం అఖిలేష్ తెలిపారు. ఈ రోజు లక్నోలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన, సమాజ్ వాది పార్టీ చీలిక దిశగా వెళుతోందన్న వార్తలపై స్పందించారు. తన తండ్రితో తనకు ఎలాంటి విభేదాలు లేవని, కొత్త పార్టీ పెట్టడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి లోనైన అఖిలేశ్... కన్నీరు పెట్టుకున్నారు. యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ కాదంటూ అమర్ సింగ్ చెప్పడం తనను ఎంతో బాధించిందని ఆయన అన్నారు. రాంగోపాల్ యాదవ్ ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా, ఆయనపై చర్య తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు శివపాల్ యాదవ్ మాట్లాడుతూ, కొత్త పార్టీ పెడతానని అఖిలేశ్ తనతో స్వయంగా చెప్పాడని తెలిపారు. పార్టీ సమావేశంలో మాట్లాడటానికి శివపాల్ లేవగానే, అఖిలేశ్ వర్గీయులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో అఖిలేశ్ కల్పించుకుని, ముందుగా ములాయం, శివపాల్ లను మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని తన అనుచరులను కోరారు. పార్టీలో ప్రతి ఒక్కరు ములాయం బాటలోనే నడుస్తున్నారని... ఆయన మార్గంలో వీలైనన్ని విజయాలను తాను సాధించానని చెప్పారు. ఆయన మనసులో ఏ ముందో తెలుసుకోవాలని పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారని తెలిపారు.