: చికిత్సకు లొంగని మలేరియా వ్యాపిస్తోంది
మలేరియా నిపుణులు ఏదైతే జరగకూడదని చాన్నాళ్లుగా భయపడుతూ ఉన్నారో అదే జరిగింది. మలేరియా సోకిన వారికి ఇవ్వగల అత్యుత్తమ చికిత్స అర్టిమిసినన్ కాంబినేషన్ థెరపీ లేదా యాక్ట్ అనే చికిత్సను కూడా తట్టుకుని వ్యాధిని వ్యాప్తి చెందించగల మలేరియా పేరసైట్స్‌ను నిపుణులు థాయిలాండ్, మయన్మార్ సరిహద్దుల్లో కనుగొన్నారు.
ఇది అత్యంత ప్రమాదకరమైనదని వైద్యులు భావిస్తున్నారు. పశ్చిమ కాంబోడియా ప్రాంతంలో 2008లోనే దీన్ని కనుగొన్నారు. అప్పటినుంచి ఈ పేరసైట్స్ ఆసియా ప్రాంతానికి విస్తరిస్తున్నట్లు తాజాగా తేలింది. వీటిపై అన్ని రకాల మలేరియా మందులను ప్రయోగిస్తున్నప్పటికీ ఫలితం ఉండడం లేదని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ డాక్టర్ ఒలీవో మియోట్టో చెప్పారు.