: ఆ ఎన్ కౌంటర్ నిజమే... 18 మంది మావోలు మరణించారు: ఏపీ డీజీపీ
ఆంధ్ర-ఒడిశా బోర్డర్ (ఏఓబీ)లో అర్ధరాత్ర నుంచి ఉదయం వరకు భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ ను ఏపీ డీజీపీ సాంబశివరావు ధ్రువీకరించారు. ఈ రోజు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, ఎన్ కౌంటర్ లో 18 నుంచి 23 మంది వరకు మావోయిస్టులు మృతి చెందారని తెలిపారు. ఘటనా స్థలంలో 4 ఏకే 47లు, 2 ఎస్ఎల్ఆర్ లు, పదిహేను 303 రైఫిల్స్, ల్యాండ్ మైన్స్ స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఘటన జరిగిన చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. అవసరం అయితే, అదనపు బలగాలను తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మృతుల్లో ఎవరెవరు ఉన్నారనే విషయంపై పూర్తి స్థాయి సమాచారం రావాల్సి ఉందని తెలిపారు. మరోవైపు, మావోయిస్టు కాల్పుల్లో గాయపడ్డ పోలీసులను చికిత్స నిమిత్తం హెలికాప్టర్ లో విశాఖకు తరలించారు. ఈ ఎన్ కౌంటర్ లో ఆంధ్ర, ఒడిశా బలగాలు పాలుపంచుకున్నాయి. ఏపీకి సంబంధించిన గ్రేహౌండ్స్ దళాలు, స్పెషన్ పోలీస్ బలగాలు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయి.