: ‘పరుచూరి బ్రదర్స్’ అని ఎన్టీఆర్ పేరుపెడితే మొదట్లో మాకు అర్థం కాలేదు: పరుచూరి గోపాలకృష్ణ
‘మీ పేరు నేను పెడతానని నాడు ఎన్టీఆర్ అన్నారు. ఒక్క నిమిషం ఆలోచించి.. పరుచూరి బ్రదర్స్’ అని నాడు ఎన్టీఆర్ మా అన్నదమ్ములకు నామకరణం చేశార'ని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, మేము మాటలు రాసిన తొమ్మిది చిత్రాల వరకు ‘పరుచూరి’ అనే పేరు వస్తుండేది. ఆ తర్వాత ఎన్టీఆర్ గారి 'అనురాగ దేవత' చిత్రానికి మాటలు రాస్తున్నాము. ‘మీరు ఇద్దరు ఉన్నారు కదా, మరి, పరుచూరి అనే ఇస్తున్నారేంటి? అని ఎన్టీఆర్ గారు అన్నారు. అందుకు ఏదో సమాధానం చెప్పాం. ఈలోగా, ఎన్టీఆర్ గారే, మాకు పేరు పెడతామని చెప్పి ‘పరుచూరి బ్రదర్స్’ అని నామకరణం చేశారు. అయితే, ఆయన చెప్పింది మాకు ఒక్క నిమిషం ఎక్కలేదు. ఆ తర్వాత మళ్లీ ఎన్టీఆర్ గారు వివరంగా చెప్పారు. ‘ ‘రామ లక్ష్మణులు’ అంటే అన్నదమ్ముల పేర్లు విడివిడిగానే ఉంటాయి. కానీ, ‘పరుచూరి బ్రదర్స్’ అన్న దాంట్లో అన్నదమ్ములు ఇద్దరూ కలిసే ఉంటారు’ అని ఎన్టీఆర్ గారు వివరించి చెప్పడంతో ఆంతర్యం అప్పుడు మాకు అర్థమైంది’ అంటూ నాటి విషయాలను పరుచూరి గోపాలకృష్ణ గుర్తు చేసుకున్నారు.