: పిల్లల్ని కనాలన్న కోరికను పెంచేందుకు అరచి గోలచేసే చిన్నారి రోబోలను పంచుతున్న జపాన్
మరో 30 సంవత్సరాల్లో యువతరం కన్నా 70 సంవత్సరాలకు పైబడిన వయో వృద్ధుల సంఖ్య రెండింతలు పెరుగుతుందని భయపడుతున్న జపాన్, జనాభాను పెంచేందుకు రంగంలోకి దిగింది. పెళ్లి కాకుండా ఉండిపోతున్న యువతీ యువకుల సంఖ్య నానాటికీ పెరుగుతుండటం, పెళ్లయినా, పిల్లలు వద్దని భావిస్తున్న వారు అధికంగా ఉన్న నేపథ్యంలో వారిలో పిల్లలు కలగాలన్న కోరికను పెంచేందుకు చిన్నారి రోబోలను పంచుతోంది. తొమ్మిది నెలల వయసు నుంచి రెండేళ్ల వరకూ వయసున్న చిన్నారి రోబోలను తయారు చేసిన శాస్త్రవేత్తలు వాటిని యువతకు అందిస్తోంది. ఈ రోబోలు చిన్న పిల్లలు చేసినట్టే అల్లరి చేస్తాయి. పెద్దగా ఏడుస్తాయి. ఆ సమయంలో వాటిని చేతుల్లోకి తీసుకుని లాలిస్తేనే ఏడుపు ఆపుతాయి. అరచి గోల చేస్తాయి. తన తల్లిదండ్రుల చేతి స్పర్శకు స్పందిస్తాయి. అప్పుడప్పుడూ జలుబు, జ్వరం వంటి రోగాలను తెచ్చుకుంటాయి. వీటిని చూసి, వీటితో కాలం గడిపే యువతీ యువకులు, తమకూ పిల్లలుండాలని కోరుకుంటారని, తద్వారా జనాభా పెరుగుతుందన్నది జపాన్ ప్రభుత్వం ఆలోచన.