: ఒక్కర్ని కూడా వదిలిపెట్టను.. అందరినీ కోర్టుకు ఈడుస్తా... తనపై ఆరోపణలు గుప్పిస్తున్న మహిళలపై ట్రంప్ ఫైర్
తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ రచ్చకెక్కుతున్న మహిళల్లో ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, అందరినీ కోర్టుకు ఈడుస్తానని అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఎన్నికలు పూర్తయ్యాక అందరిపై కోర్టులో కేసులు వేస్తానని పేర్కొన్నారు. తనపై లైంగిక ఆరోపణలు చేస్తున్న మహిళలతోపాటు తనపై అభాండాలు వేస్తున్న హిల్లరీ క్యాంపెయిన్‌పైనా కోర్టుకు వెళ్తానని ఆయన స్పష్టం చేశారు. ‘‘ఎన్నికలు పూర్తి కానివ్వండి. ఈ అబద్ధాల కోరులందరిపైనా దావాలు వేస్తా. ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదు’’ అని ట్రంప్ పేర్కొన్నారు. తన ఎన్నికల ప్రచారాన్ని దెబ్బ కొట్టేందుకు తనపై అసత్య ఆరోపణలు చేసిన ప్రతి మహిళా ప్రయత్నించిందని ట్రంప్ పేర్కొన్నారు. కాగా తమపై ట్రంప్ అసభ్యంగా ప్రవర్తించాడంటూ పది మంది మహిళలు బహిరంగంగా ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. మహిళల వరుస ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అయిన ట్రంప్.. హిల్లరీతో జరిగిన మూడో డిబేట్‌లోనూ వెనకబడ్డారు. దీనికితోడు సర్వేల్లో ప్రత్యర్థి హిల్లరీకే విజయావకాశాలు మెండుగా ఉన్నాయని తేలాయి. తనపై వస్తున్న లైంగిక ఆరోపణలు కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయని భావించిన ట్రంప్, వారిపై కోర్టుకు వెళ్లడం ద్వారా మరికొందరికి ఆ చాన్స్ ఇవ్వకూడదని భావిస్తున్నట్టు సమాచారం.