: ఆస్తులు అమ్మేసి ప్రజలకు పంచేందుకు సిద్ధమైన మంత్రి.. మల్లాడి సంచలన ప్రకటన
యానాం ఎమ్మెల్యే, పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చి కోట్లాది రూపాయలు పోగేసుకోవాలని చూసే వారికి ఆయన నిర్ణయం చెంప పెట్టులాంటిదనే చెప్పాలి. తన మొత్తం ఆస్తులను ప్రజల సమక్షంలో విక్రయించి వాటిని నిరుపేదల కష్టాలు తీర్చేందుకు వినియోగిస్తానంటూ శనివారం సంచలన ప్రకటన చేశారు. తన ఆస్తుల వేలం ద్వారా వచ్చిన మొత్తం సొమ్మును ఇంటి గడపదాటి బయటకు రాలేని దుర్భర స్థితిలో ఉన్న నిరుపేదలకు పంచనున్నట్టు ఆయన పేర్కొన్నారు. తను ఉండే ఇంటిని మాత్రం మినహాయించి భార్య, తనకు సంబంధించిన బంగారం, కార్లు, మోటారు సైకిళ్లను ప్రముఖులు, ప్రజల సమక్షంలో బహిరంగ వేలం వేసి వచ్చిన డబ్బుతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి పేదలకు పంపిణీ చేస్తానని మల్లాడి స్పష్టం చేశారు. ఆస్తులు అమ్మి పేదలకు పంచుతానన్న మంత్రి నిర్ణయంపై సర్వత్ర హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.