: వయసు 92.. భార్యలు 97 మంది.. నైజీరియా వృద్ధుడి రికార్డు
ఒకటి, రెండు, మూడు, నాలుగు.. ఇలా లెక్కించుకుంటూ పోతే 97 దగ్గర ఆగుతుంది, ఆ నైజీరియన్ భార్యల లెక్క. అతడి వయసు కూడా ఏమంత ఎక్కువేం కాదు.. జస్ట్ 92 ఏళ్లే! నైజీరియాలోని బిడా ప్రాంతానికి చెందిన మొహమ్మద్ బెల్లో అబుబకర్ మత నిబంధనలను సైతం పక్కనపెట్టి ఏకంగా 107 మందిని పెళ్లాడాడు. ఆ తర్వాత పదిమందికి విడాకులిచ్చి ప్రస్తుతం 97 మందితో హాయిగా జీవిస్తున్నాడు. వారందరికీ కలిపి మొత్తం 185 మంది సంతానం. వారిందరినీ పోషించేందుకు తగిన శక్తిని అల్లా తనకు ప్రసాదించాడని బెల్లో పేర్కొన్నాడు. 2008లో బెల్లోకు 86 మంది భార్యలు ఉన్నారు. అప్పట్లో నైజీరియా న్యాయస్థానం అతడికి వార్నింగ్ ఇచ్చింది. తక్షణం వారిలో 82 మందికి విడాకులు ఇచ్చేసి నలుగురితో మాత్రమే కాపురం చేయాలని పేర్కొంటూ హెచ్చరికలు జారీ చేసింది. అయినా ఏమాత్రం తగ్గని బెల్లో జైలు శిక్ష అనుభవించేందుకు సిద్ధమయ్యాడు తప్పితే వారిలో ఒక్కరిని కూడా వదులుకునేందుకు ఇష్టపడలేదు. పైపెచ్చు తన వివాహాలను కొనసాగిస్తూ వచ్చాడు. భార్య, ఇద్దరు పిల్లలున్న చిన్న కుటుంబాలను కూడా పోషించేందుకు విపరీతంగా కష్టపడాల్సి వస్తున్న ఈ రోజుల్లో ఏకంగా 97 మంది భార్యలను మెయింటెన్ చేయడం మామూలు విషయం కాదంటే అతిశయోక్తి కాదేమో!