: అమరావతి శంకుస్థాపనకు నేటితో ఏడాది.. తాత్కాలిక సచివాలయం పూర్తి, పాలన షురూ
ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజున నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మించ తలపెట్టిన రాజధాని నగరానికి అమరావతిగా నామకరణం జరిగింది కూడా ఇదే రోజున. ఏపీ నూతన రాజధాని కోసం తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల్లోని 22,189 మంది రైతుల నుంచి 34,470 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. చంద్రబాబు పిలుపు మేరకు వేలాదిమంది ప్రజలు శంకుస్థాపనకు హాజరై ఇటుకలను విరాళంగా అందజేశారు. ఈ అపూర్వ ఘట్టానికి శనివారంతో ఏడాది పూర్తవుతోంది. రాజధానిలో శాశ్వత భవనాల నిర్మాణానికి ముందే ఇక్కడి నుంచి పాలన సాగించాలన్న ముఖ్యమంత్రి లక్ష్యానికి అనుగుణంగా వెలగపూడి వద్ద 45 ఎకరాల్లో తాత్కాలిక సచివాలయం నిర్మాణం చేపట్టాలని భావించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 17న శంకుస్థాపన చేశారు. రూ.201 కోట్లతో చేపట్టిన ఈ భవనాల నిర్మాణాన్ని కేవలం 8 నెలల్లోనే పూర్తిచేశారు. ఇటీవల ఈ భవనాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ప్రస్తుతం ఏపీ పాలన ఇక్కడి నుంచే కొనసాగుతోంది. ఈ నెల 28న అమరావతిలోని ఆర్థిక, పరిపాలన భవనాలకు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ శంకుస్థాపన చేయనున్నారు. డిసెంబరు 2018 నాటికి అమరావతి నిర్మాణం పూర్తిచేయాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఇక రాజధానికి భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన విధంగా ప్లాట్ల పంపిణీ మొదలు పెట్టింది. ఇప్పటికే పది గ్రామాల రైతులకు లాటరీ పద్ధతిలో ప్లాట్లు కేటాయించారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తూ రాజధాని నిర్మాణం కారణంగా ఉపాధి కోల్పోయిన భూమి లేని నిరుపేదలకు, నిరుద్యోగులకు ప్రభుత్వం ప్రతినెలా రూ.2,500 పింఛను ఇస్తోంది. మొత్తం 29 గ్రామాల్లోని 19,189 మందికి పింఛను అందుతోంది. మరోవైపు రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రదేశాన్ని పర్యాటక స్థలంగా మార్చడంతో నిత్యం ఎంతోమంది వచ్చి ఆయా ప్రాంతాలను సందర్శిస్తున్నారు. రాజధానిలో విద్య, వైద్య, ఆతిథ్య రంగాల్లో పెట్టుబడులకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి.