: అదుపుతప్పిన నన్నపనేని రాజకుమారి కారు.. యువకుడికి తీవ్ర గాయాలు
ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్, టీడీపీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి, ముఠా పనిచేసే వ్యక్తిని ఢీ కొట్టింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడ్డ అతన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గుంటూరు, నందివెలుగు రోడ్డులోని బాలాజీనగర్ లో నివసించే అన్నం గరటయ్య (27) బీఏటీ పొగాకు కంపెనీలో ముఠా పనిచేస్తుంటాడు. ఈరోజు ఉదయం దాణా తెచ్చేందుకు ద్విచక్రవాహనంపై తక్కెళ్ల పాడు బయలుదేరాడు. అయితే, అటు వైపు నుంచి వస్తున్న రాజకుమారి ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనం, ఆటోను ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి, గరటయ్య ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడ్డ గరటయ్యను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు తరలించారు. అయితే, పీజీ వైద్య విద్యార్థులే గరటయ్యకు వైద్య సేవలందించారు. ప్రత్యేక విభాగం వైద్యులు ఎవరూ పట్టించుకోకపోవడంతో బాధితుడి బంధువులు ఆందోళనకు దిగారు. అయితే, ఆసుపత్రి వైద్యులతో టీడీపీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చర్చించిన అనంతరం, బాధితుడిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ సంఘటనపై నన్నపనేని రాజకుమారి స్పందించలేదని బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు.