: అబ్బాయిలే ఆడపిల్లలకు ఎదురుకట్నం ఇచ్చే రోజులు ఇవి: చంద్రబాబు
'ఒకప్పుడు ఆడబిడ్డలు కట్నాలు ఇవ్వాల్సి వచ్చేది, ఇప్పుడు మాత్రం అబ్బాయిలే ఆడపిల్లలకు ఎదురుకట్నం ఇచ్చే రోజులు వచ్చాయి.. సమాజంలో చోటుచేసుకున్న పెనుమార్పు ఇది' అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడ ఇబ్రహీంపట్నంలో ఈరోజు కాపు జాబ్ మేళాలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి ఆడపిల్లలు బాగా పనిచేస్తున్నారని, ఇది ఎలా సాధ్యమైంది? అని కృష్ణా జిల్లాకు ఇటీవల వచ్చిన మైక్రోసాఫ్ట్ సంస్థ తనను అడిగిందని అన్నారు. అందుకు తాను స్పందిస్తూ, తాను సీఎంగా ఉన్న సమయంలో కాలేజీ సీట్లలో వారికి 33 శాతం రిజర్వేషన్ కల్పించానని, ఇప్పుడు ఏ కళాశాలకు వెళ్లి చూసినా 50 శాతం కంటే ఎక్కువ మంది అమ్మాయిలే ఉన్నారని, ఇక్కడి అమ్మాయిలు చాలా తెలివైన వారని, బాగా చదువుకుంటారని ఆ సంస్థ ప్రతినిధులతో తాను చెప్పానంటూ ఆ విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు.