: క్రికెట్ దిగ్గజం గవాస్కర్ కు ఎస్జేఎమ్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు
ముంబయి స్పోర్ట్స్ జర్నలిస్ట్ ల అసోసియేషన్ (ఎస్జేఎమ్) లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అందుకోనున్నారు. ఎస్జేఎమ్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో భాగంగా ఈ అవార్డుతో గవాస్కర్ ను సత్కరించనున్నారు. క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో డిసెంబర్ 11న ముంబయిలోని నిర్వహించే ఒక కార్యక్రమంలో ఈ అవార్డుతో గవాస్కర్ ను సత్కరించనున్నట్లు ఎస్జేఎమ్ ఒక ప్రకటనలో పేర్కొంది. డిసెంబర్ 11న వాంఖడే స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ ల మధ్య జరగనున్న నాల్గో టెస్టు మ్యాచ్ లో నాల్గో రోజున గవాస్కర్ ను లైఫ్ టైమ్ అవార్డుతో సత్కరిస్తామన్నారు. కాగా, భారత్ క్రికెట్ తో గవాస్కర్ కు 50 సంవత్సరాల అనుబంధం వుంది. 1966 అక్టోబర్ లో మొయిన్- ఉద్- దౌలా గోల్డ్ కప్ ద్వారా ఫస్ట్ క్లాసు క్రికెట్ లోకి గవాస్కర్ అడుగుపెట్టారు. వజీర్ సుల్తాన్ XI టీమ్ కు ప్రాతినిధ్యం వహించిన గవాస్కర్, మొయిన్- ఉద్- దౌలా గోల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్ లో దుంగార్ పూర్ XIపై తలపడ్డారు.