: వందలాది మంది అమెరికన్లు షగ్గీ బుట్టలో పడి కోట్లు సమర్పించుకున్న విధం ఇదే!
థానేలో కాల్ సెంటర్ నిర్వహిస్తూ వందలాది మంది అమెరికన్లను బుట్టలో వేసుకుని, వారిని బెదిరించి దాదాపు రూ. 500 కోట్లు నొక్కేసిన షగ్గీ, ఎలా ఈ దందాను నడిపించాడన్న విషయాన్ని పూస గుచ్చినట్టు వెల్లడించారు పోలీసులు. ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ముందుగా ఓ ఇంటర్నెట్ ఆధారిత రికార్డెడ్ కాల్ ను తయారు చేశారు. "మీరు ఆదాయపు పన్ను ఎగ్గొట్టారు" అంటూ ఈ కాల్ మొదలవుతుంది. సాంకేతికంగా 'బ్లాస్టింగ్' అని పిలిచే విధానం ద్వారా ఒకేసారి వేలాది ఫోన్లకు ఈ కాల్ వెళుతుంది. ఇక వీటిని రిసీవ్ చేసుకునే వారిలో అత్యధికులు ఫేక్ కాల్ గా భావించి పెట్టేస్తారు. పన్ను ఎగ్గొట్టిన వారు మాత్రం మొత్తం కాల్ ను వింటారు. ఈ మొత్తం కాల్ ను విన్న ఫోన్ నంబర్ల వివరాలు పక్కకు వచ్చేస్తాయి. ఫోన్ నంబర్ ఆధారంగా వారి పేరు, చిరునామా తెలుస్తాయి. కొంత మంది భయపడిన వారు అదే నంబరుకు తిరిగి కాల్ చేస్తారు కూడా. తొలి దశ వడపోత ఇలా జరుగుతుంది. ఇక రెండో దశలో వారి చిరునామాలను బట్టి అది ఎలాంటి ప్రాంతం, సదరు వ్యక్తి ఎంతవరకూ చెల్లించగలుగుతాడు? అన్న విషయాన్ని షగ్గీ టీం అంచనా వేస్తుంది. అప్పుడిక సంప్రదింపులు మొదలవుతాయి. ఈ కాల్స్ అన్నీ అహ్మదాబాద్ లోని ఓ సర్వర్ నుంచి వీఓఐపీ విధానంలో వెళతాయి. డీఐడీ (డైరెక్ట్ ఇన్ వర్డ్ డయలింగ్) విధానాన్ని కూడా వీరు వాడారు. ఈ విధానంలో కాల్ వెళితే, సెల్ ఫోన్ డిస్ ప్లేపై అమెరికన్ నంబరే పడుతుంది. ఆపై నిజమైన పన్ను ఎగవేతదారులు భయంతో బుట్టలో పడతారు. సమాధానం చెబుతారు. ఆపై సమస్యను పరిష్కరించుకునేందుకు ఓ డీల్ ఉందని చెబుతూ, ముగ్గులోకి దించుతారు. ఇక్కడి వరకూ కాల్ సెంటర్ చిన్న ఉద్యోగులే తతంగం నడుపుతారు. ఆపై షగ్గీ నియమించుకున్న మాస్టర్ మైండ్స్ రంగంలోకి దిగుతారు. సాధ్యమైనంత ఎక్కువ మొత్తాన్ని బాధితుల నుంచి లాగుతారు. బాధితులతో గిఫ్ట్ కార్డు కొనిపించి దాని 16 అంకెల డిజిటల్ నంబర్ ను చెప్పించుకోవడం ద్వారా వీరు డబ్బు నొక్కుతారు. ఆపై అమెరికాలో ఉన్న తన వెండార్లకు ఆ గిఫ్ట్ కార్డు నంబర్ చెప్పి, దాని విలువైన రూపాయలను ముంబై, అహ్మదాబాద్ ప్రాంతాల్లోని హవాలా వ్యాపారుల ద్వారా తీసుకుంటారు. కాగా, ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిన తరువాత, గత నెల 4, 5 తేదీల్లో కాల్ సెంటర్లపై దాడులు జరిపిన ముంబై పోలీసులు ఎంతో మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.