: వన్ ఐడియా కెన్ చేంజ్ ఏ లైఫ్... రూ. 5 పెట్టి టీ తాగితే, 30 నిమిషాల ఇంటర్నెట్... 100 నుంచి 500కు పెరిగిన టీ అమ్మకాలు
అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన నేటి తరంలో ఓ చిన్న వినూత్న ఆలోచన జీవన గమనాన్ని ఎలా మార్చుతుందో తెలిపేందుకు మరో చక్కని ఉదాహరణిది. రోజుకు 100 టీలు అమ్ముకుని జీవనం సాగించే కర్ణాటకలోని సిరిగుప్ప ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల సాయీద్ ఖాదర్ బాషా అనే యువకుడికి చక్కటి ఆలోచన వచ్చింది. తన టీ స్టాల్ కు ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుని, ఓ ఇంటర్నెట్ రూటర్ ను పెట్టి, ఐదు రూపాయలు పెట్టి టీ తాగిన వారందరికీ 30 నిమిషాల వైఫై సిగ్నల్స్ ఇవ్వాలని నిర్ణయించాడు. ఈ ఆలోచన సూపర్ హిట్ అయింది. 10 నుంచి 15 మంది వరకూ 2 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ ను వాడుకునే సౌకర్యం ఇక్కడ ఉండటంతో టీ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఏకంగా రోజుకు 500 టీలు అమ్మే స్థాయికి సయీద్ చేరుకున్నాడు. ఇప్పుడు సయీద్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, ఉదయ్ పూర్, వడోదరలకు చెందిన మరో ఇద్దరు చాయ్ వాలాలు కూడా ఇలాంటి ఆలోచనలే చేసి విజయం సాధించి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.