: ఏపీ రాజకీయాలు చాలు లోకేష్... తెలంగాణ వైపు చూడకు: ఎంపీ కవిత
తెలంగాణలో పాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్న కొత్త జిల్లాలపై లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని నిజామాబాద్ ఎంపీ కవిత విమర్శించారు. ఈ ఉదయం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ, లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసుకుంటే బాగుంటుందని, మేము ఏపీ పాలన గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో, లోకేష్ తెలంగాణపై వ్యాఖ్యానించడం అలానే ఉంటుందని ఆమె దుయ్యబట్టారు. తమపై విమర్శలు చేసే అర్హత లోకేష్ కు లేదని అన్నారు. తమ ముఖ్యమంత్రి సాగునీటి ప్రాజెక్టులకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని, ప్రతి ఎకరాన్నీ నీటితో తడపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. 2019లోనూ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తామని, అందులో ఎలాంటి డౌటూ లేదని నొక్కి చెప్పారు.