: తెలంగాణ సాయిబాబా సమాఖ్య ఏర్పాటు చేస్తున్నాం.. సాయిపై వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం: దిల్‌సుఖ్ నగర్ షిరిడీ సాయిబాబా సంస్థాన్
త్వరలోనే తెలంగాణ సాయిబాబా సమాఖ్య ఏర్పాటు చేస్తున్నామని, సాయిపై వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్ నగర్‌లోని శ్రీ షిరిడీ సాయిబాబా సంస్థాన్ ప్రకటించింది. షిరిడీ సాయినాథుడు దేవుడు కాదంటూ మీడియా ముందుకు వచ్చి మరీ ద్వారకా పీఠాధిపతి స్వరూపానంద తీవ్ర వ్యాఖ్యలు చేయడం పట్ల సాయి భక్తులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి, హోంమంత్రి స్పందించాలని వారు డిమాండ్ చేశారు. రోడ్డుపైకి వచ్చి ఆందోళన తెలిపారు. షిరిడీ సాయి దేవుడు కాదంటూ సాయిబాబా భక్తుల మనోభావాలు దెబ్బతీశారని స్వరూపానందపై వారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్వరూపానంద దిష్టిబొమ్మను రోడ్డుపై దగ్ధం చేసి, కుంకుమ కలిపిన నీళ్లను దానిపై చల్లారు. అజ్ఞానంతో ద్వారకా పీఠాధిపతి మాట్లాడుతున్నారని అన్నారు. షిరిడీ సాయిబాబా దేవస్థానంతో పాటు ప్రపంచంలో ఉన్న సాయిబాబా భక్తులంతా స్వరూపానంద వ్యాఖ్యలపై స్పందించాలని డిమాండ్ చేశారు. 23వ తేదీన తెలంగాణకు వస్తోన్న ద్వారకా పీఠాధిపతి స్వరూపానందను ఇక్కడ అడుగుపెట్టనివ్వబోమని చెప్పారు. కాషాయ వస్త్రం ధరించిన తీవ్రవాదిలా స్వరూపానంద వ్యవహరిస్తున్నారని వారు అన్నారు. స్వరూపానందకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.