: డెబిట్ కార్డులపై ఆందోళన వద్దు: ఆర్థిక శాఖ
భారతీయులు వాడుతున్న డెబిట్ కార్డుల వివరాలు అక్రమార్కులకు తెలిసిపోయాయని, 36 లక్షల కార్డుల వివరాలను సర్వర్ల నుంచి అపహరించుకుపోయారని వచ్చిన వార్తలు ఆందోళన కలిగిస్తున్న వేళ, పరిస్థితిని శాంతింపజేసేందుకు ఆర్థిక శాఖ నడుం బిగించింది. ఇండియాలో బ్యాంకు లావాదేవీలు పూర్తి సురక్షితమని ఆర్థిక సేవల విభాగం అదనపు కార్యదర్శి జీసీ ముర్ము వ్యాఖ్యానించారు. దేశంలోని 99.5 శాతం కార్డుల సమాచారం అత్యంత సురక్షితంగా ఉందని, కేవలం 0.5 శాతం కార్డుల వివరాలు బయటకు వెళ్లుండవచ్చని, ఆయా కార్డులను మార్చే చర్యలు మొదలయ్యాయని వివరించారు. ప్రస్తుతం ఇండియాలో 60 కోట్లకు పైగా డెబిట్ కార్డులు ఉన్నాయని, వాటిల్లో 19 కోట్ల కార్డులు స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన రూపే కార్డులని, మిగతావన్నీ వీసా, మాస్టర్ కార్డ్ ప్లాట్ ఫాంలపై పని చేస్తున్నాయని ఆయన తెలిపారు. మే నెలలో హిటాచి ఏటీఎం మెషీన్ల ద్వారా లావాదేవీలు జరిపిన డెబిట్ కార్డుల వివరాలు మాత్రమే హ్యాకర్ల చేతికి వెళ్లాయని ఆయన అన్నారు. మొత్తం ఎంత నష్టం జరిగిందన్న వివరాలను గణిస్తున్నామని ముర్ము వెల్లడించారు. కాగా, సెక్యూరిటీ కారణాల దృష్ట్యా, తమ కస్టమర్లంతా ఏటీఎం పిన్ నంబరును వెంటనే మార్చుకోవాలని కెనరా బ్యాంకు ఓ ప్రకటనలో కోరింది.