: ఎంటెక్ విద్యార్థి ప్రాణాలను బలిగొన్న హైదరాబాద్ అధ్వానపు రోడ్లు... కూకట్ పల్లిలో దారుణం


హైదరాబాదులోని కూకట్ పల్లిలో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంటెక్ చదువుతున్న విద్యార్థి దుర్మరణం చెందాడు. ఈ ఘటన కూకట్ పల్లి 'వై' జంక్షన్ వద్ద జరిగింది. పోలీసుల కథనం ప్రకారం, కేపీహెచ్ బీ కాలనీకి చెందిన అరుణ్ కుమార్ (25) ఎంటెక్ చదువుతున్నాడు. హఫీజ్ పేటలో నివాసం ఉండే తన స్నేహితుడు సోమశేఖర్ (32)తో కలసి బైక్ పై మూసాపేట వైపు వెళుతున్నారు. 'వై' జంక్షన్ సమీపించగానే, ఎదురుగా రోడ్డుపై ఉన్న గుంతను తప్పించే ప్రయత్నం చేశారు. దీంతో, అదుపు తప్పి కిందపడిపోయారు. ఈ క్రమంలో, వెనుక కూర్చున్న అరుణ్ కుమార్ తలకు బలమైన దెబ్బ తగిలింది. దీంతో, అతను అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలపాలైన సోమశేఖర్ ను ఆసుపత్రికి తరలించారు. జరిగిన ఘటనతో, స్థానికుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. రోడ్లు గుంతలమయంగా మారినప్పటికీ, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వారు మండిపడుతున్నారు. ఈ అధ్వానపు రోడ్లే విద్యార్థి మృతికి కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News