: ఆ సినిమాపై మాట్లాడి, ప్రమాదాలు కొనితెచ్చుకోలేను: అమీర్ ఖాన్ మేనల్లుడు


ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జొహార్ నిర్మించిన 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా విడుదల విషయం భారత్, పాక్ దేశాల్లో ఉత్కంఠను రేపుతున్న సంగతి తెలిసిందే. పాక్ నటులు నటించిన ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోను ఆడనివ్వమంటూ మహారాష్ట్ర నవ నిర్మాణ సేన డెడ్లీ వార్నింగ్ ఇవ్వడంతో... ఈ సినిమా విడుదలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉరీ ఉగ్ర దాడుల నేపథ్యంలో, ఎమ్మెన్నెస్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో, కరణ్ కు, పాక్ నటులకు అనుకూలంగా మాట్లాడిన బాలీవుడు ప్రముఖులు చాలా మందిపై విమర్శల వర్షం కురిసింది. ఈ క్రమంలో, ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మేనల్లుడు, యువ హీరో అయిన ఇమ్రాన్ ఖాన్ ఈ సినిమా వివాదంపై మాట్లాడనని స్పష్టం చేశాడు. ఈ వివాదానికి సంబంధించి తన అభిప్రాయాలను వెల్లడించి, ప్రమాదాలను కొనితెచ్చుకోలేనని చెప్పాడు. ఈ వివాదంపై తనకు కూడా స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయని... అయితే, వాటిని వెల్లడిస్తే, కొంత మంది మా ఇంటిని కూడా తగలబెట్టే ప్రయత్నం చేస్తారని తెలిపాడు. దాడి చేస్తామనే హెచ్చరికలను తాను ఎదుర్కోదలచలేదని... అందుకే, తన అభిప్రాయాలను తనలోనే దాచుకుంటున్నానని చెప్పాడు.

  • Loading...

More Telugu News