: ఉగాదులు, ఉషస్సులు లేని పోలీసుల త్యాగాలకు ధన్యవాదాలు: చంద్రబాబు
ఉగాదులు, ఉషస్సులు లేని పోలీసుల త్యాగాలు మరువలేనివని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొనియాడారు. విజయవాడలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో ఆయన మాట్లాడుతూ, పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేమని అన్నారు. సమాజంలో శాంతి భద్రతలు నెలకొల్పే గురుతర బాధ్యత పోలీసులపై వుందని చెప్పారు. మనం అందరం కుటుంబ సభ్యులతో పండగలు, పబ్బాలు చేసుకుంటే వారు మాత్రం విధుల్లో నిమగ్నమై ఉంటారని, అంకితభావంతో పని చేస్తారని ఆయన ప్రశంసించారు. సమాజంలో అనేక సవాళ్లు ఎదుర్కొనే పోలీసుల సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఆయన తెలిపారు. కులాలు, మతాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టే వారిని నియంత్రించేది పోలీసులేనని ఆయన చెప్పారు. మంగళగిరిలో ఫిఫ్త్ బెటాలియన్ కేంద్రం ఏర్పాటు చేస్తామని, అక్కడ పోలీసు అమరవీరుల స్మారక స్థూపం నిర్మిస్తామని, వచ్చే ఏడాది పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని అక్కడి నిర్వహించుకుందామని అన్నారు. పోలీసుల సంక్షేమానికి 15 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని అన్నారు. హోం గార్డులకు జీవిత బీమా చేయిస్తామని అన్నారు. హోం గార్డుల ప్రాణాలకు ఎలాంటి ముప్పు సంభవించినా వారి కుటుంబానికి 5 లక్షల రూపాయలు అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.