: మనకి ఉమెన్ ట్రాఫికింగ్ ఎలాగో... జపాన్ లో పోర్న్ ఇండస్ట్రీ అలాంటిది!
'తనువు పుండై.. తను పండై.. తాను శవమై.. వేరొకరి వశమై...' ఆనందం పంచుతుందని పడుపు వృత్తిబాధితుల దీన గాథను వర్ణించాడు ఓ కవి. మనదేశంలో ఇలా ఎంతో మంది అమాయకులైన యువతులు బలవంతంగా వ్యభిచారం రొంపిలోకి లాగబడి వేదన అనుభవిస్తున్నారు. అలాగే, జపాన్ లో పోర్న్ రొచ్చులోకి కూడా అమ్మాయిల్ని లాగుతారని ప్రముఖ పోర్న్ స్టార్ సాకి కొజాయ్ (24) తెలిపింది. పోర్న్ స్టార్ గా మారిన చేదు అనుభవం గురించి ఆమె మాట్లాడుతూ, సరిగ్గా 21 ఏళ్ల వయసులో చదువు పూర్తి చేసుకుని మోడల్ గా రాణించి, సినిమాల్లో నటించాలన్న లక్ష్యంతో ఓ మోడల్ ఏజెన్సీని సంప్రదించానని తెలిపింది. అక్కడ అన్ని రకాలుగా పరీక్షించిన వారు కాంట్రాక్టు పేరుతో అన్ని పేపర్లపై సంతకాలు తీసుకుని ఆడిషన్స్ కి రమ్మన్నారని చెప్పింది. అక్కడికి వెళ్లాక 20 మంది మగాళ్ల ముందు బట్టలన్నీ తీసెయ్యమన్నారని వెల్లడించింది. వారిని ప్రతిఘటించే ప్రయత్నం చేసినా 20 మంది మగాళ్ల ముందు తన బలం సరిపోలేదని చెప్పింది. పెనుగులాటలో ఉండగా, కాంట్రాక్టు పేపర్స్ గురించి గుర్తు చేశారని, ఎక్కువ చేస్తే కుటుంబాన్ని అంతం చేయడానికి కూడా వెనుకాడమని బెదిరించారని తెలిపింది. దీంతో రెండేళ్ల పాటు వాళ్లు చెప్పినవన్నీ చేయాల్సి వచ్చిందని వాపోయింది. ఒకసారి పోర్న్ స్టార్ ముద్ర పడిన తరువాత ఎవరూ ఉద్యోగమివ్వరని ఆమె చెప్పింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ కంపెనీ నుంచి బయటపడిన సాకి, ఫ్రీలాన్స్ పోర్న్ స్టార్ గా పని చేస్తున్నానని తెలిపింది. ఇది తన గాథ మాత్రమే కాదని, కొన్ని వందల మంది జపాన్ యువతుల దీనగాథ అని వెల్లడించింది. జపాన్ లో ప్రతి ఏటా 30,000 పోర్న్ సినిమాలు తయారవుతాయని గణాంకాలు చెబుతున్నాయి. అందుకే అక్కడి అందమైన అమ్మాయిలపై వివిధ రకాలుగా వల వేసి, ఆకట్టుకుని నిలువునా ముంచుతున్నారని, పోర్న్ ఇండస్ట్రీని ఉక్కుపాదంతో అణచివేయాలని మానవహక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.