: ట్రంప్, హిల్లరీ ఎక్కడ కంగుతిన్నారంటే..!
అమెరికాలోని లాస్ వెగాస్ లో నిర్వహించిన ఫైనల్ ప్రెసిడెన్షియల్ డిబేట్ లో హోరాహోరీ వాదనలు, వివరణలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, ప్రశ్నలు, సమాధానాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో అధ్యక్ష అభ్యర్ధులు రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ హిల్లరీ క్లింటన్ ఒకరిపై ఒకరు తీవ్రంగా ఆరోపణలు సంధించుకున్నారు. నువ్వు అబద్ధాల కోరువంటే, కాదు నువ్వే అబద్ధాల కోరువని అసహనం వ్యక్తం చేసుకున్నారు. నువ్వు యుద్ధ పిపాసివంటే, నువ్వే యుద్ధపిపాసివంటూ విమర్శించుకున్నారు. ఈ క్రమంలో ట్రంప్, హిల్లరీలు కొన్ని సందర్భాల్లో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ప్రధానంగా మహిళలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, రష్యాను సమర్థించిన విషయం, తన కంపెనీల్లో చైనా ఉద్యోగులను అధిక సంఖ్యలో నియమించుకోవడం, విదేశాంగ విధానం తదితరాలపై ప్రశ్నలు సంధించినప్పుడు ట్రంప్ కాస్త ఇబ్బంది పడగా, హిల్లరీ క్లింటన్ ఈ మెయిల్స్ వ్యవహారం, క్లింటన్ ఫౌండేషన్ నిధులు, రహస్య వ్యవహారాలు వంటి వాటిపై సమాధానం చెప్పినప్పుడు ఇద్దరూ కాస్త అసహనంగా కదిలారు.