: ‘థమ్స్ అప్’ బ్రాండ్ అంబాసిడర్ గా సల్మాన్ ఖాన్ అవుట్...కొత్త ప్రచారకర్తగా రణ్ వీర్ సింగ్
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ని థమ్స్ అప్ బ్రాండ్ అంబాసిడర్ (ప్రచారకర్త) పోస్టు నుంచి తొలగించారు. ఈ మేరకు ప్రముఖ బేవరేజెస్ సంస్థ కోకో కోలా ఇండియా ప్రకటించింది. ఈ సంస్థకు నాలుగేళ్ల పాటు ప్రచారకర్తగా వ్యవహరించిన సల్మాన్ ను పక్కన పెట్టి, ఆయన స్థానంలో బాలీవుడ్ యువ నటుడు రణ్ వీర్ సింగ్ ను తీసుకుంది. సల్మాన్ తో సంస్థ చేసుకున్న ఒప్పందం గత నెలతో ముగిసినట్లు సంబంధిత వర్గాల సమాచారం. అయితే, ఈ విషయమై వ్యాఖ్యానించేందుకు కోకో కోలా ఇండియా ప్రతినిధులు నిరాకరించారు. వయసు రీత్యా సల్మాన్ పెద్దవాడు కావడంతో తమ బ్రాండ్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని, అతని స్థానంలో యంగ్ హీరోని తీసుకోవాలన్న ఉద్దేశంతో రణ్ వీర్ ను తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే సంస్థ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న మరో నటుడు అక్షయ్ కుమార్ ను పక్కన పెట్టి, 2012 అక్టోబరులో రెండోసారి సల్మాన్ బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. అదే సమయంలో తమ ఉత్పత్తుల ప్రమోషన్ నిమిత్తం సల్మాన్ సొంత సంస్థ అయిన ‘బీయింగ్ హ్యూమన్’తో కూడా కోకో కోలా ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. కాగా, పాక్-భారత్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్ నటులను సమర్ధించిన సల్మాన్ పై పలు విమర్శలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే కోకోకోలా ఇండియా తమ బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి సల్మాన్ ను పక్కనపెట్టిందనే వార్తలు కూడా హల్ చల్ చేస్తున్నాయి.