: పాక్ తో యుద్ధం వస్తే ఎన్నికల్లో లాభం పొందాలనుకుంటోంది: బీజేపీపై దిగ్విజయ్ ధ్వజం
భారత సైన్యం జరిపిన సర్జికల్ దాడులను కూడా మోదీ ప్రభుత్వం రాజకీయాలకు వాడుకుంటోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. ఆర్ఎస్ఎస్ శిక్షణ వల్లే సర్జికల్ స్ట్రయిక్స్ జరిగాయంటూ ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. గతంలో కూడా ఈ తరహా దాడులు జరిగాయని తెలిపారు. పాకిస్థాన్ తో యుద్ధం వస్తే ఎన్నికల్లో లాభం పొందాలనేదే బీజేపీ వ్యూహమని అన్నారు. గతంలో ఇందిర, లాల్ బహదూర్ శాస్త్రి కూడా పాకిస్థాన్ తో యుద్ధం చేశారని గుర్తు చేశారు. ఒక మతం (ముస్లిం)పై కామన్ సివిల్ కోడ్ ను రుద్దితే కాంగ్రెస్ పార్టీ అంగీకరించదని స్పష్టం చేశారు. దళితులపై దాడులు జరిగితే తల దించుకుంటానన్న మోదీ... గుజరాత్ లో దళితులపై ఊచకోత జరిగితే కనీసం స్పందించలేదని విమర్శించారు. బ్రిక్స్ డిక్లరేషన్ లో సిరియా ప్రస్తావన ఉందే తప్ప, పాకిస్థాన్ ప్రస్తావన లేదని... ఇది మోదీ వైఫల్యమని ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కూడా దిగ్విజయ్ నిప్పులు చెరిగారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆరే పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించడం ప్రజాస్వామ్యానికి దుర్దినమన్నారు. ఫిరాయింపులు బహిరంగంగానే జరుగుతున్నా, న్యాయవ్యవస్థ నిర్ణయం తీసుకోకపోవడం దారుణం అని అన్నారు. ఈ రోజు హైదరాబాదులోని చార్మినార్ వద్ద రాజీవ్ సద్భావన యాత్ర స్మారక సభను కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ దిగ్విజయ్ పైవ్యాఖ్యలు చేశారు.